14, జులై 2017, శుక్రవారం

200+ తెలుగు సామెతలు

కనుమరుగవుతున్న  కొన్ని తెలుగు సామెతలు:

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
210. శుభం పలకరా వెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!

ఆకాశవాణి

ఆరింటికి
“ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.."
అనగానే లేచి కూచునేవాళ్ళం.
గబగబా దంతధావనం కానిచ్చేసి కాసిన్ని పాలు తాగేసి హోమ్ వర్కేఁవైనా వుంటే కానిచ్చేసి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికి పుష్పాంజలి మొదలయ్యేది.

సోమవారంనాడు భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, మంగళవారం సూపర్‌మేన్ లో “శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా" అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో “నమో నమో హనుమంతా" అన్నపాటో...ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో!

స్కూలునించి మధ్యాహ్నం భోజనానికి వస్తే “ఆకాశవాణి! ఈవార్తలు ఇంతటితో సమాప్తం!" అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో..ఎవరో ఒకరు పలకరించేవారు.

 “అన్నాలకి లేవండి! మళ్ళా ఆలస్యఁవైందంటారు!" అని అమ్మ తరుముతోంటే గబగబా తింటూ కార్మికుల కార్యక్రమం వినేవాళ్ళం.
చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు.
 సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే పసిడిపంటలు మొదలయ్యేది. అంతే! పరుగోపరుగు. నడిచి స్కూలుకెళ్ళడానికి ఇరవై నిమిషాలు పట్టేది.

ఎప్పుడైనా సెలవురోజు ఇంట్లోవుంటే పసిడిపంటలవ్వగానే ప్రాంతీయ వార్తలు చదివేవారు ప్రయాగ రామకృష్ణ, తిరుమలశెట్టి శ్రీరాములు....
వీళ్ళంతా అవవ్వగానే “మనోరంజని! మీరు కోరిన మధురగీతాలు వింటారు!" అని మీనాక్షో, ఏవియస్ రామారావో అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం.
 ఆ అరగంటా ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచిమంచి పాటలన్నీ వేసేవారు. అవన్నీ చెవులు రిక్కించిమరీ వినేవాళ్ళం.

రెండవ్వగానే ఇంగ్లీషులో వార్తలు..ఢిల్లీనించి ప్రసారమయ్యేవి.
ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం.

ఇప్పుడు వాట్సప్పుల్లోను, ఫేస్ బుక్కుల్లోను కనబడే ‘ హ్మ్......., లోల్....., ఆర్వోఎఫ్ఫెల్....., కె..కె...(ఓకే ఓకే కొచ్చిన తిప్పలు)..ఇవన్నీ చదువుతోంటే నవ్వు, అసహ్యం, భయం....ఈమూడురకాల భావాలు ఒకేసారి కలుగుతున్నాయి.

నిన్నొకటి చూసాను. ‘డబ్ల్యూ సి' అని రాస్తున్నారు. చాలాచోట్ల చూసాక అడిగితే అది ‘వెల్ కమ్' అని చెప్పారు మా వంశోద్ధారకులు.
నా సందేహమేంటంటే వీళ్ళు కొన్నాళ్ళకి వెల్ కమ్ స్పెల్లింగు మర్చిపోతారేమోనని!
సర్సరే! రేడియోలో వున్నాంకదా!

ఇక ఆదివారాలు సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు. వి.వి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఏబియస్ రామారావు, పాండురంగ విఠల్... వీరందరూ ఎక్కువగా వినబడేవారు.
వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులమైపోయేవాళ్ళం.
అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.

ఇప్పుడు మన యాంకర్లు, టీవీ డబ్బింగ్ ఆర్టిస్టులు, దుష్టచతుష్టయపు హీరోలు...
వీరందరూ మాట్లాడుతున్న భాష వినికూడా మనం బ్రతికున్నామంటే ఏదో బలమైన కారణం, మనవల్ల ఈ సమాజానికి జరగాల్సిన మంచి వుండివుంటాయి
ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ పాటలవీ వేస్తుండేవారు.
అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీనుంచి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వరవిన్యాసాన్ని ఆలకించిన మాజన్మలు ధన్యం.

రేడియో ఒక ప్రసారసాధనంలానో, పాటలపెట్టెలానో కాకుండా మాకు భాషమీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం.

గుణం

* కొడుకు నిజమైన గుణం వాడి పెళ్ళి తరువాత తెలుస్తుంది

* కూతురి నిజమైన గుణం తన యుక్త వయసులో తెలుస్తుంది

* మొగుడి నిజమైన గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది

* భార్య నిజమైన గుణం తన భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది

* స్నేహితుని నిజమైన గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది

* అన్నదమ్ముల నిజమైన గుణం వారు పడే గొడవలలో తెలుస్తుంది

* పిల్లల నిజమైన గుణం మన వ్రుధ్ధాప్యంలో తెలుస్తుంది

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?


గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదు. పండుగలైనా.. ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు..కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.. ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది. ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది.
ఆషాఢమాసం వచ్చేస్తోంది .. అనగానే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెరిసిపోతుంటాయి. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక ఉన్న మర్మమేంటో.. మీకు తెలుసా..?
ఆషాఢమాసంతో గ్రీష్మరుతువు పూర్తిగా వెళ్లిపోయి..వర్షరుతువు ప్రారంభమౌతుంది. గ్రీష్మంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది..మన శరీరంలో ఉన్న వేడి ..బయట చల్లబడిన వాతావరణం పరస్పర విరుద్ధం కాబట్టి అనారోగ్యాలు మొదలౌతాయి. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి ఉంది.
అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్లే మన ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.
మహిళలు.. ఈ ఆషాడంలో అందంతో పాటు..ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీ అరచేతుల నిండా నింపుకోండి.

నా క్రెడిట్ కార్డు..!!"

పెళ్లి జరిగిపోయింది..
అప్పగింతలు జరుగుతున్నాయి..

అమ్మాయిని సాగనంపుతూ అందరూ moody గా ఉన్న సమయంలో..

పెళ్ళికూతురు..
పెళ్ళికొడుకు చేయి విడిపించుకుని..
తండ్రి దగ్గరకు వచ్చి..
కౌగలించుకుని..
ప్రేమగా.. ఒక ముద్దు పెట్టి..

అతని చేతిలో ఒక వస్తువు పెట్టి..
కళ్ళు తుడుచుకుంటూ వెనుతిరిగింది..

చెమర్చిన కళ్ళతో..
ఈ దృశ్యాన్ని చూస్తున్న బంధువులు..
తండ్రికేమిచ్చిందా అని ఆసక్తిగా చూసారు..

తండ్రి కూడా కుతూహలంగా తన గుప్పెట చూసుకుని..
మరుక్షణం ఎంతో సంతోషంగా..

"ఇది నా జీవితంలో ఆనందకరమైన రోజు.. నా కూతురు వెళ్ళిపోతూ నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది..

ఇరవైరెండేళ్లుగా నేను కనీసం కంటితో చూడలేకపోయిన నా వస్తువును, ఇక ఎన్నటికీ నాకు దక్కదు అనుకున్నదాన్ని  నాకు తిరిగిచ్చింది..

అదేంటోతెలుసా..!

నా క్రెడిట్ కార్డు..!!"

అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు..

ఒక్క బిక్క మొహం పెళ్ళికొడుకు తప్ప..

మన మహత్తర చారు .......... చదవండి.

మన మహత్తర చారు .......... చదవండి.

‘చారు’ అంటే పూర్తిగా ఆంధ్రులదే అని చెప్పుకోవాలి.

కొంచెం చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారు చేసే ఆరోగ్యకరమయిన, రుచికరమయిన వంట ‘చారు’!

 ఎన్ని వంటాకాలున్న ఆఖరికి మజ్జిగా అన్నం ముందు చారు అన్నం తిననిదే భోజనం పూర్తి అయినట్లు అనిపించదు.

ఓ సారి సినారె గారు అమెరికా వెళ్ళినప్పుడు వారి బంధువుల ఇంట్లో భోజనాల సమయంలో ‘రైస్’, ‘కర్రీ’. ‘కర్డ్’ వంటి ఆంగ్ల పదాలే వినిపించాయిట! ఒక్కటయినా తెలుగు పదం వినిపిస్తుందా అని రెడ్డి గారు ఆలోచిస్తూ వుంటే ఆ ఇంటి వాళ్ళ పాప ‘చారు’ అని అడిగిందట.....

........ ‘హమ్మయ్య, చాలు’ అనుకున్నారట. అన్నింటికీ పరభాషా పదాలు ఉన్నాయిగాని మన తెలుగింటి వంటకం ‘చారు’ కి మాత్రం లేదు.

చారుల్లో కూడ పప్పు చారు, టమాటో చారు, ఉలవ చారు, నిమ్మకాయ చారు, మిరియాల చారు, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి.

జలుబు చేసినప్పుడు మిరియాల చారు ఘాటుగా గొంతు దిగుతూ ఉంటే ఎంతో ఉపశమనంగా వుంటుంది.

ఎక్కడయినా రెండు రోజులు విందు భోజనం చేసి ఇంటికి వచ్చాక కమ్మగా కొంచెం చారు అన్నం తింటే ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది.

చారుకి పోపు వేస్తె ఇల్లంతా ఆ ఘుమఘుమలే .. !!

ఇంక కుంపటిమీద సత్తుగిన్నెలో కాచిన ‘ఆ రుచే వారు’ అంటారు బాపు గారు.. ఆ అనుభూతి ఆస్వాదిస్తేనే తెలుస్తుంది.

చాలామంది తెలుగువారికి చారంటే మహా ఇష్టం ..  ‘చారే కదా’ అని తేలిగ్గా తీసిపారేస్తుంటారు కొందరు.

అది కూడా కొందరి చేతిలోనే రుచి పడుతుంది సుమండీ!

మాత్రుహీన శిశుజీవనం వృధా,
 కాంతహీన నవయవ్వనం వృధా,
శాన్తిహీనతపసః ఫలం వృధా, తింత్రిణీరస విహీన భోజనం !!

తల్లిలేని పిల్లవాని బ్రతుకు, భార్యలేనివాని యవ్వనం,
శాంతం లేని ఋషి తపస్సు ఇవన్నీ ‘చారు’ లేని భోజనంలా నిష్ఫలం అని పై శ్లోకానికి అర్ధం.

నీ ఇష్టం

ఎవరు రాశారో తెలీదు, కానీ చాలా బాగుంది. హేట్సాఫ్ టు హిమ్.
🙏🙏🙏🙏🙏🙏

👉మంత్రికి
          తెలివుండాలి,
     
బంటుకి
       భక్తుండాలి...

గుర్రానికి
       వేగముండాలి

ఏనుగుకి
        బలముండాలి...

సేనాధిపతికి
     వ్యూహముండాలి,

సైనికుడికి
           తెగింపుండాలి...

యుద్ధం నెగ్గాలంటే,
   వీళ్ళందరి వెనుక
      కసి వున్న ఒక రాజుండాలి!

👉మనందరిలో ఒక రాజుంటాడు...

కానీ మనమే,
రాజులా ఆలోచించడం
            ఎప్పుడో ఆపేశాం!

👉"మన కసి -
అడవులని చీల్చయినా సరే,
సముద్రాలని కోసయినా సరే,
    కొత్త దారులు కనుక్కోగలదు" అని మనకి తెలుసు.

అయినా,
భయానికి బానిసయ్యాం.
      ఓటమికి తలొంచేసాం !

👉చరిత్రలో,
చాలా మంది రాజులు...

 🌺ఓడిపోయారు,
    🌺 పారిపోయారు,
       🌺 దాక్కున్నారు,
         🌺 దాసోహమయ్యారు.

కానీ కొందరే,
అన్నీ పోగొట్టుకున్నా
కసితో మళ్ళీ తిరిగొచ్చి
             యుద్ధం చేశారు.

'రాజంటే స్థానం కాదు,
  రాజంటే స్థాయి' అని
                నిరూపించారు.

👉డబ్బొచ్చినా పోయినా
       వ్యక్తిత్వం కోల్పోకు...

రాజ్యాలున్నా చేజారినా
         రాజసం కోల్పోకు...

👉రాజంటే
కిరీటం కోట పరివారం కాదు,

      రాజంటే
               ధైర్యం...

                రాజంటే
                        ధర్మం...

                      రాజంటే
                             యుద్ధం...!

👉ఒకరోజు
విందుభోజనం చేస్తావు,

ఇంకోరోజు
అడుక్కుతింటావు
          - పాండవుల్లా...!

👉ఒక రాత్రి
బంగారు దుప్పటి
          కప్పుకుంటావు,

మరో రాత్రి
చలికి వణికిపోతావు
           - శ్రీరాముడిలా...!

👉ఎత్తు నుండి నేర్చుకో,
  లోతు నుండి నేర్చుకో...

రెండింటి నుండి
   ఎంతో కొంత తీసుకో...!

👉రాజంటే
  స్టానం కాదు
రాజంటే
         స్థాయి...

👉స్థానం - భౌతికం,
     కళ్ళకు కనపడుతుంది.
స్థాయి - మానసికం,
     మనసుకు తెలుస్తుంది...!

మనందరిలో
ఒక రాజుంటాడు...

బ్రతికిస్తావో,
చంపేసుకుంటావో నీ ఇష్టం!

గుర్తు

భార్య : ఏవండోయ్.. ఇవాళ  సాయంకాలం తొందరగా ఇంటికి రండి సినిమాకు వెళ్దాం....

భర్త : నా దగ్గర TRS 🚙గుర్తేమైనా ఉందా, ఉండేది TDP🚲 గుర్తు... ఆలస్యం అవుతుందేమో!

భార్య : సకాలానికి వస్తే BJP🌹 గుర్తు, ఆలస్యమైతే కాంగ్రెస్✋ గుర్తు, మరీ ఆలస్యమైతే AAP🏒 గుర్తు మీకు స్వాగతం పలుకుతాయి. ఆ తర్వాత మీ ఇష్టం....
.
.
.
.
.
ఇంకా నయం ఈ మహాతల్లికి CPI గుర్తు గుర్తురాలేదు...

కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి

" మా అమ్మాయిని మేము అల్లారు ముద్దుగా పెంచాం.  అందుకని అమ్మాయికి వంట చేయడం రాదండి. కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి బావగారు... "

" అయ్యో ఎంత మాట బావగారు.. పర్లేదు ... మా అబ్బాయిని కూడా మేము అల్లారుముద్దుగా పెంచాం. సంపాయించడం రాదు అందుకని మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి బావగారు... "

ఇది మనం సాధించిన పురోగతా.....!

గతంలో సంసారం చీకట్లో జరిగేది,
జీవితాలు వెలుగులో ఉండేవి,
నేడు సంసారం వెలుగులోకి వచ్చింది,
జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి,
కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ,
చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు,
నాడు కొందరే మందుకు, విందుకు,అలవాటు పడేవారు,
నేడు కొందరే వీటికి దూరంగా ఉంటున్నారు,
నాడు కష్టమొస్తే, కుటుంబం సభ్యులు ధైర్యం చెప్పేవారు,
నేడు కుటుంబం కుటుంబాలే కష్టాల కడలికి బలియౌతున్నాయి,
నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం,
నేడు తిన్నది అరగడానికి తిన్నగా శ్రమిస్తున్నాం,
నాడు జబ్బు చేస్తే శక్తి కోసం పండ్లు, పాలు తాగేవాళ్ళం,
నేడు అదే డబ్బుతో బిళ్ళలు కొని,జబ్బులు కొనితెచ్చుకుంటున్నాం,
గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే!!
అయినా మనసు సాప్ట్ గా ఉండేది,
ఇప్పుడు అంతా సాప్ట్ వేర్ ఇంజనీర్లే!
మనసు మాత్రం పెళ్ళాం తో పంచుకోలేనంత హార్ట్ గా మారిపోయింది,
అప్పుడు వైద్యుడు ఇల్లిల్లూ తిరిగి వైద్యం చేసేవాడు,
బిల్లు వల్ల జేబుకు చిల్లు పడేదికాదు,
నేడు ఇంటిల్లిపాదీ వైద్యుని ముందు క్యూ కట్టారు,
సంపాదన సగం, వైద్యునికి సమర్పణం,

నాడు భవతీ బిక్షాందేహీ అంటే, పనికల్పించి అన్నం పెట్టేవారు,
నేడు భిక్షగాడు సైతం మందుతాగి,
ఇంటిముందు తూలుతున్నాడు,
నాడు దొంగలు నట్టింట్లోపడి దోచుకెళ్ళేవారు,
నేడు దొంగలు దొరల్లాగా నెట్ ఇంట్లో దోచేస్తున్నారు,
ఒకప్పుడు దొంగల్ని పట్టడానికి  పోలీసులు తిరిగేవారు,
ఇప్పుడు హైటెక్ పోలీసుల చుట్టూ దొంగలే తిరుగుతున్నారు,
పదికిలోమీటర్లు నడిచి,పదిరూపాయలు పెట్టి సినిమా చూసేవాళ్ళం,
ఇప్పుడు ఇంటిముందు సినిమాని వెయ్యి రూపాయలు పెట్టి చూస్తున్నాం,
అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడేవాళ్ళం,
ఇప్పుడు తప్పు చేయడానికే అన్నట్లు  అప్పు చేసేస్తున్నాం,
ఒకప్పుడు కప్పు పాలు,పెరుగు అమ్మి,సొమ్ము చేయలేక తాగేవాళ్ళం,
ఇప్పుడు ప్లాస్టిక్  కప్పుల్లో పాలు, పెరుగు తినేస్తున్నాం,
చైనా నుండి పెన్నులు,గన్నులు మాత్రమే  వచ్చేవి,
నేడు చైనా ప్లాస్టిక్ బియ్యం కూడా వస్తున్నాయి...
ఇది మనం సాధించిన పురోగతా.....!
లేక మనకు మనం తెచ్చుకున్న అధోగతా....! ఈ పోస్ట్ కి మనకి సంభంధం ఏంటీలే అనుకోకండి.... ఇలా ఉన్న వాళ్ళలోనే ఉంటూ అలానే బ్రతుకుతునం మనం కూడా...

26, ఏప్రిల్ 2017, బుధవారం

"పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు"

"పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు"

1) పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించినవాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.

2) తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.

3) పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.

4) పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.

5) పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ - సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.

6) పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.

7) ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.

ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది 

పాత పదాలు - కొత్త అర్థాలు :

 
 

15, ఏప్రిల్ 2017, శనివారం

' ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల అభిప్రాయాలూ , అనుభవాలూ !

' ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల  అభిప్రాయాలూ , అనుభవాలూ !
-------------------------------------------------------
1.  ' శ్రీరామ రాజ్యం' ఎలా వుండేదో  ఉత్తరకాండలో ఈ వర్ణన చూడండి

  " వ్యవసాయదారులు ఎవరూ పండిన వెంటనే పంట కోసుకోవాలని  తొందర పడటంలేదు !

రాశులుగా పోసిన  ధాన్యానికి ఎవరూ కాపలా వుండట్లేదు !

గాదెలు కట్టుకోటానికి ఎవరూ ఆత్రుత  పడటంలేదు . ధాన్యం బస్తాలు ఇంటిబైటే పడేసి అంతా నిశ్చింతగా నిద్రపోతున్నారు .
రామరాజ్యంలో ఎవరికీ తిండికరువూ , దొంగతనం అవసరం వుండదని వారికి తెలుసు !
( మహర్షి వాల్మీకి )

2. ఆకలిగొన్నవాడికి   ' దేవుడు '  కనపడేది అన్నం రూపంలోనే !
( మహాత్మా గాంధీ ) .

3. " నేను వంటింట్లోకి వేరే  పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని !
ఎంతయినా అమ్మ అంటే అన్నం.  అన్నం అంటే అమ్మ ! అంతే !
( జంధ్యాలగారు ) .

4. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం ! ( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .

5. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !  వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో  మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !
( రేలంగి వెంకట్రామయ్య గారు ) .

6. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా,   మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !
( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .

7. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు
" అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు.
అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ
అర్ధం కాలేదు !
( ఆత్రేయ గారు )

8. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం !
అమ్మ చేతి   అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !
( చాగంటి కోటే శ్వర రావుగారు ) .

9.  ఆకలితో వున్న వాని  మాటలకు ఆగ్రహించవద్దు !!
( గౌతమ బుద్దుడు ).

10. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది !
( మాతా అమృతానందమయి ) .

11 . మీ భర్త ఎంత ధనవంతుడయినా,  మీకోసం మీరు స్వంతంగా ఒక కప్పు కాఫీ సంపాదించుకునే శక్తి లేనప్పుడు మిడిసిపడటం అనవసరం !
( యద్దనపూడి సులోచనారాణిగారు ) .

12. మీ పిల్లలు ఎంతదూరంలో,  ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు
మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించు !