14, ఏప్రిల్ 2017, శుక్రవారం

స్నేహ గీతం

స్నేహ గీతం
******
స్నేహ గీతం
శృతి  కలవాలంటే
హృదయ బంధం పెనవేసుకోవాలి
ఎక్కడ , ఎప్పుడు
ఎవరితో,  ఎలా  మొదలౌతుందో
చెప్పనలవికాని
అపూర్వ స్థితి  స్నేహం !

బాల్యం బడిలోనో
చదువుల ఒడిలోనో
ప్రయాణ పదనిసల్లోనో
జీవన ప్రస్థానంలోనో
ఆట పాటల్లోనో
క్లబ్బు పబ్బుల్లోనో
వృత్తి ప్రవృత్తిలోనో
వర్గ చైతన్యం లోనో

ఎక్కడైతేనేం... ఎలా అయితేనేం ...
స్నేహం మొదలైందంటే
ఆనంద రాగమై ఆకర్షిస్తుంది
అపశృతి పలికిందంటే
శత్రు శేషమై వికర్షిస్తుంది !

అవసరాలే పునాదైతే
ఆనతికాలంలోనే అంతరిస్తుంది
నిస్వార్ధమే వేదికైతే
తుది శ్వాస వరకూ తోడవుతుంది !

నిజమైన స్నేహానికి
అంతస్తుల తేడాలుండవు
హోదాల బేధాలుండవు
కష్ట సుఖాల్లో తోడూ నీడై
పరస్పర సాయానికి చేయూతవుతుంది
నిజాయితీ  నమ్మకం పునాదులై
ప్రేమాభిమానాలకు ఆలంబనౌతుంది !

స్నేహ ప్రస్థానంలో
అభిప్రాయాలు  వేరైతే
పరస్పర గౌరవం అనివార్యం
అవసరాలు ఒక్కటైతే
అన్యోన్య త్యాగాలకు సంసిద్ధం !

స్నేహమంటే శ్వాస
స్నేహమంటే భరోసా
స్నేహమంటే  అనుబంధం
స్నేహమంటే  ఆత్మబంధం !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి